ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య ఈ మూడింటికీ పనికొచ్చేలా…. పాలిటెక్నిక్ ల్లో ప్రత్యేక డిప్లొమా కోర్సులు ఉన్నాయి. అందులో వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల డ్యూరేషన్ తో తెలుగు మీడియంలోనే డిప్లొమాలు కొన్ని సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జాతీయ స్థాయిలో ప్రత్యేక విభాగాల్లో కూడా డిప్లొమాలు పూర్తిచేసుకోడానికి అవకాశం ఉంటుంది.
వ్యవసాయ డిప్లొమా కోర్సులు
గ్రామీణ విద్యార్థులు… వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవకాశాలను అందుకోడానికి వ్యవసాయ డిప్లొమా కోర్సలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ రంగం అంటే ఇష్టం ఉన్నవాల్ళు… వీటిల్లో చేరవచ్చు. వీటిని రెండేళ్లు/మూడేళ్ల కోర్సుతో రూపొందించారు. Diploma in Agriculture, Diploma in Agriculture (Organic Forming), Diploma in Agriculture (Seed Technology ) కోర్సులను రెండేళ్లల్లో పూర్తి చేయవచ్చు. ఈ డిప్లొమా కోర్సు పూర్తయితే ఫెర్టిలైజర్స్, బయో కెమికల్స్, ఫెస్టిసైడ్స్ తయారీ సంస్థల్లో అవకాశాలు దక్కుతాయి. లేదా మీరే సొంతంగా లేటెస్ట్ టెక్నాలజీతో సాగు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉన్నత విద్య చదువుకోవాలి అనుకుంటే… B.Sc., Agriculture కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ డిప్లొమా స్టూడెంట్స్ కోసం 20 శాతం సీట్లు AGRI CET ద్వారా సూపర్ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. Diploma in Agricultural Engineering కోర్సు అయితే మూడేళ్లల్లో పూర్తి చేయొచ్చు. తర్వాత B.Tech అగ్రి ఇంజినీరింగ్ కోర్సు చదువుకోవచ్చు. Agricultural Diploma కోర్సుల్లో అడ్మిషన్ కోసం టెన్త్ క్లాస్ లో గ్రేడ్ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండేళ్ల కోర్సులను తెలుగు మీడియంలో కూడా చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదువుకున్నవారికి అవకాశం కల్పిస్తారు. ఏపీలో అయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. అలాగే తెలంగాణాలో.. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్ కోర్సులు నడుస్తున్నాయి.
AP students : https://angrau.ac.in/
TS Students : https://www.pjtsau.edu.in/
Animal Husbandry, Dairy, Fishery
గ్రామాల్లోని జంతువులకు వెంటనే వైద్యం అందించేందుకు వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. ఇవి పూర్తి చేసుకున్నవారికి పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయి. సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా సొంతంగా యూనిట్ పెట్టుకోవచ్చు. యానిమల్ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్లతో తెలుగు మీడియంలోనే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. డిప్లొమా తర్వాత వీళ్ళు BVSc.& AH, B.Tech.,Dairy Technology, B.Fsc.ల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు మాత్రమే అర్హులు.
పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్లు లేదా ఎంట్రన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో… శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుస్తున్నాయి. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధితో యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్ కోర్సులు చదువుకోవచ్చు.
ఉద్యానవన డిప్లొమాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పత్తులు పెరగడంతో అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. టెన్త్ లో గ్రేడ్ పాయింట్లు లేదా ఎంట్రన్స్ లో మార్కుల ఆధారంగా రెండేళ్ల ఉద్యాన డిప్లొమాలో సీట్లు కేటాయిస్తారు. తెలుగు మీడియంలో స్టడీ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. డిప్లొమా తర్వాత ఉన్నత విద్య చదువుకోవాలంటే… B.Sc.,(ఆనర్స్) Horticulture కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఏపీ/ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్ YSR ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలో రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. దాని అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్ పాలిటెక్నిక్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల Diploma in Horticulture Course నడుస్తోంది.
హ్యాండ్లూమ్ టెక్నాలజీ..
ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ (వెంకటగిరి) Diploma in Handloom & Textiles Technology కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు దాదాపు 50 సీట్లు కేటాయిస్తారు. పదో తరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. కోర్సు పూర్తయ్యాక Textile తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు కోర్సు మొత్తం పూర్తయ్యేదాకా ప్రతి నెలా Scholarship అందిస్తారు. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు.
ప్లాస్టిక్ డిప్లొమా..
Central Institute of Plastic Engineering & Technology (CPET) హైదరాబాద్, విజయవాడ క్యాంపస్ ల్లో మూడేళ్ల వ్యవధితో Diploma in Plastics Mould Technology (DPMT), Diploma in Plastics Technology (DPT) కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సీట్లు మిగిలితే నేరుగా పదో తరగతి విద్యార్హతతోనే తీసుకుంటున్నారు. ఈ కోర్సులో పూర్తి చేసుకున్నవారికి ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ స్పెషలైజేషన్ B.Tech కూడా చదువుకోవచ్చు.