మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించారు. ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురు భారతరత్నకు ఎంపికయ్యారు. గతంలో బిహార్ జననేత కర్పూరి ఠాకూర్ తో పాటు… మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీకి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకే ఏడాదిలో మొత్తం ఐదుగురికి భారతరత్న ఇదే మొదటిసారి.
1991 నుంచి 1996 వరకూ భారత ప్రధానిగా పీవీ పనిచేశారు. మే 1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టారు. 90ల్లో ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ. అప్పుల ఊబిలో కూరుకుపోయి… విదేశాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఆర్థిక సంస్కరణలను భారత్ లో కూడా ప్రవేశపెట్టారు పీవీ. విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్కరణలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు. ఓ తెలుగు వ్యక్తికి భారత రత్న రావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 53 మందికి భారత రత్న అవార్డులను ఇచ్చింది.
పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్ యూనివర్సిటీల్లో చదివారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1957-77 లో ఉమ్మడి ఏపీలో అనేక మంత్రి పదవుల్లో కొనసాగారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో హోంశాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 1991లో రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకున్నారు. కానీ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పీవీ పనిచేశారు. ఈ పదవి చేపట్టిన మొదటి దక్షిణ భారత, ఏకైక తెలుగువ్యక్తి పీవీ. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఆయన. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి 5లక్షల మెజార్టీతో గెలిచి సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి గురించి అవగాహన ఉన్న పీవీ… తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.