ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి స్మగుల్ చేయటానికి అవకాశంగా మారుతుందని టర్కీ నుంచి దిగుమతి అవుతున్న గస గసాలపై 2013లో అలహాబాద్ హైకోర్టు నిషేధం విధించింది. గస గసాలను అన్ని దేశాల్లో పండించరు. పండించకూడదనే ఒప్పందం ఉంది. కేవలం అనుమతి ఇచ్చిన దేశాల్లో మాత్రమే (టర్కీ అందులో ఒకటి)… అది కూడా UN ఆధ్వర్యంలోనే పండించాలి. కొన్ని రకాల స్వీట్లలోనూ, కొన్ని క్రానిక్ జబ్బుల నియంత్రణ కోసం వాడటానికి పరిమిత మొత్తంలో ఈ గస గసాలను పండిస్తారు.
టర్కీ అధికారిక ఉత్పత్తి 2012లో 4 వేల టన్నుల కంటే తక్కువగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 2002-2007 మధ్య ఒక వ్యాపారికి ఏడాదికి 85 టన్నుల గసగసాల దిగుమతికి మాత్రమే అనుమతి ఇచ్చేవారు. తరువాత దాన్ని 510 టన్నులకు పెంచారు. 2010లో, దిగుమతి పరిమాణంపై అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. దాంతో 2012లో ముంబై-ఢిల్లీ నుంచి వ్యాపారులు 2 లక్షల టన్నుల దాకా గసగసాలను దిగుమతి చేసుకున్నారు. గస గసాలు దేశంలో ఉత్పత్తి కంటే దిగుమతులు ఎక్కువ అవడం ఆందోళన కలిగించే విషయం.
గస గసాలు దిగుమతి చేసుకుంటే తప్పేంటి ?
ఇవి డ్రగ్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న అనుమానాలు ఉన్నాయి. మార్ఫిన్ లాంటి వాటి కోసం కూడా గస గసాలను వాడుతున్నారు. మెదడుకు శరీరంతో సంబంధం లేకుండా చేసేదే ఈ మార్ఫిన్. మూడో దశ క్యాన్సర్ పేషంట్లకూ దీన్ని ఇస్తుంటారు. మతిస్థిమితం కోల్పోయేలా చేయటం వల్ల క్యాన్సర్ బాధ తెలియకుండా ఉంటుంది.
గసగసాలలో ఓపియం ఆల్కలాయిడ్స్ మార్ఫిన్, కోడైన్‌లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. విపరీతమైన మత్తుని కలిగిస్తాయి. డ్రగ్ టెస్టుల్లో విఫలమయ్యేలా చేస్తాయి.
ఖుస్ ఖుస్/ఖష్ ఖష్ తినే వ్యక్తులు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ అని తేలితే వారికి శిక్షలు విధించవచ్చని మలేషియా అధికారులు చెప్పారు. యూనివర్సిటీ మలయా – పాథాలజీ విభాగానికి చెందిన ముస్తఫా అలీ మొహద్ కొన్ని పరిశోధనలు చేశారు. గస గసాలలో చాలా తక్కువ మొత్తంలో కోడైన్ ఉంటుందనీ… ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే తప్ప మూత్ర పరీక్షలో గుర్తించడం కష్టమన్నారు.
గసగసాల మొక్కలో చాలా భాగాలు వ్యసనానికి బానిస చేస్తాయనీ… మత్తుతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాయనీ… కానీ విత్తనాలు తినవచ్చని అన్నారు అలీ మొహద్. ప్రస్తుతం గస గసాల విత్తనాలు కలిగి ఉంటే ఎన్నోదేశాల్లో చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నారు.
మాదకద్రవ్యాలు కలిగి ఉంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో, అవే గసగసాలు కలిగి ఉన్నా వర్తిస్తాయి. ప్రస్తుతం సింగపూర్, తైవాన్, అమెరికా, సౌదీ, UAEలో గసగసాల సీడ్స్ కలిగి ఉంటే అక్కడి ప్రభుత్వాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే డిఫెన్స్ చేసుకోడానికి కూడా అవకాశం ఉండదు.