09 SEPT CURRENT AFFAIRS

09 SEPT CURRENT AFFAIRS

US ఓపెన్ మహిళల టైటిల్ విన్నర్ సబలెంక: ఫైనల్లో జెస్సికపై ఘన విజయం

సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన US Open Women Singles టైటిల్ ను బెలారస్ కు చెందిన అరీనా సబలెంక గెలుచుకుంది. 2024 సెప్టెంబర్ 8న న్యూయార్క్ లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక.. 7-5, 7-5తో జెస్సిక పెగుల (USA)ను ఓడించింది. రెండో సీడ్ సబలెంకకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.  US Open గెలుచుకోవడం ఇదే మొదటిసారి. గతేడాది ఫైనల్లో అమెరికా అమ్మాయి కోకో గాఫ్ చేతిలో ఓడిన సబలెంక.. ఈసారి వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన టైటిల్ పోరులో సబలింక…. తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడింది. ఈ విజయంతో 2016 తర్వాత ఒకే ఏడాది హార్డ్ కోర్ట్ లో రెండు టైటిల్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, US ఓపెన్) గెలిచిన మొదటి ప్లేయర్ గా సబలెంక నిలిచింది. గతంలో 2016లో జర్మనీ ప్లేయర్ కెర్బర్ ఈ ఘనత సాధించింది. సబలెంకకు ప్రైజ్ మనీ 3,600,000 US డాలర్లు.  అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.30.23 కోట్లు

OCAఅధ్యక్షుడిగా రణ్ ధీర్

ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (Olympic council of Asia) అధ్యక్షుడిగా రణ్ ధీర్ సింగ్ ఎంపికయ్యారు. 2024 సెప్టెంబర్ 8న జరిగిన 44వ OCA జనరల్ అసెంబ్లీలో రణధీర్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత ఒలింపిక్ సంఘం, OCAలో వివిధ పదవులు చేపట్టిన రణ్ ధీరన్ ను కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవీయ, ఆసియాలోని 45 దేశాలకు సంబంధించిన క్రీడాధినేతల సమక్షంలో అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు రణ్ ధీరే.  5 ఒలింపిక్స్ లో పాల్గొన్న మాజీ షూటర్ రణ్ ధీర్ 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా (కువైట్) స్థానంలో రణ్ ధీర్ 2021 నుంచి OCAకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నైతిక విలువల ఉల్లంఘన కింద 2024 మేలో షేక్ అహ్మద్ పై 15 ఏళ్ల నిషేధం విధించారు.

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 25వ ర్యాంకు

కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2024లో 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో

  • దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాల్లో హైదరాబాద్ 3 మార్కులతో 25వ స్థానంలో నిలిచింది.
  • 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల జాబితాలో నల్గొండ 5 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరిలో సంగారెడ్డి 182.4 మార్కులతో 8వ స్థానం దక్కించుకొంది.
  • దేశవ్యాప్తంగా 130 నగరాల్లో సర్వే నిర్వహించగా తెలంగాణ నుంచి 3 నగరాలకు చోటు దక్కింది.
  • 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ర్యాంకులు విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో సూరత్ (గుజరాత్), జబల్ పూర్ (మధ్యప్రదేశ్), ఆగ్రా(ఉత్తర్ ప్రదేశ్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 3-10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్(ఉత్తర్ ప్రదేశ్), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్), 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్ బరేలి (ఉత్తర్ ప్రదేశ్), నల్గొండ(తెలంగాణ), నలాగడ్ (హిమాచల్ ప్రదేశ్) మొదటి 3 ర్యాంకులు పొందాయి.

నలిమెలకు కాళోజీ పురస్కారం

ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్…. కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. రవీంద్రభారతిలో జరిగిన ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురస్కారాన్ని అందజేసింది. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు జ్ఞాపికను అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్ తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి 2011లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఆయన రచనల్లో అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక్క లాంటి సంకలనాలు ప్రసిద్ధి చెందాయి. నలిమెలకు.. 14 భాషల్లో నైపుణ్యం ఉంది.

స్వచ్ఛవాయు సర్వేక్షణ్ విజయవాడకు 9వ ర్యాంకు : స్వచ్ఛ వాయు సర్వేక్షణ్- 2024లో 26వ స్థానంలో విశాఖపట్నం

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్- 2024లో 10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో విజయ వాడ 9, విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి. బయోమాస్, మున్సిపల్ ఘన వ్యర్ధాలు, రోడ్లపై దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి వెలువడే ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, ప్రజా చైతన్యం, గతంతో పోలిస్తే గాలిలో దూళికణాల సంఖ్య ఆధారంగా నగరాల పని తీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించారు. ఇందులో దేశ వ్యాప్తంగా పది లక్షలకు పైబడి జనాభా ఉన్న 47 నగరాల్లో విజయవాడ 9వ స్థానాన్ని (182 మార్కులు) దక్కించుకోగా, 163 మార్కులతో విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న 43 నగరాల్లో గుంటూరు 10 (185 మార్కులు), రాజమండ్రి 17 (178), నెల్లూరు 19 (171.5), కర్నూలు 23 (163.5), కడప 25 (161.7),  అనంతపురం 33 (149.3 మార్కులు)వ స్థానాల్లో నిలిచాయి. 3 లక్షల లోపు జనాభా ఉన్న 40 పట్టణాల్లో ఒంగోలు 17 (170 మార్కులు), చిత్తూరు 21 (153,9), శ్రీకాకుళం 22 (153.4), విజయనగరం 24 (146.5మార్కులు) స్థానాల్లో నిలిచాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులు విడుదల చేశారు.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!