గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్
ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్’ వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుందనీ… ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. WHO సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీచేసింది. ఎమర్జెన్సీ కమిటీ సూచన మేరకు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నామని అన్నారు WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్. వ్యాధి సోకితే తీవ్రమైన కండరాల నొప్పి, జ్వరం వస్తాయి.
వియత్నాంతో భారత్ కీలక ఒప్పందాలు
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ భారత్ పర్యటన సందర్భంగా ఆ దేశంతో 9 కీలక ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, పర్యాటకం, రేడియో, టీవీ, సైబర్, ఐటీ భద్రత, సైనిక వైద్యం లాంటి రంగాల్లో సహకారంతో పాటు 2030నాటికి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇటీవల కృపాణ్ అనే క్షిపణి నౌకను వియత్నాంకు భారత్ గిఫ్ట్ గా ఇచ్చింది. వియత్నాం సాగర భద్రతకు 30కోట్ల డాలర్ల రుణసదుపాయం అందించాలని నిర్ణయించింది.
అంగారకుడిపై నీరు
అంగారక గ్రహంపై నివాసయోగ్యతను గుర్తించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. జీవుల మనుగడకు కీలకమైనటువంటి నీటి జాడలను అంగారక గర్భంలో పరిశోధకులు గుర్తించారు. ఈ గ్రహం ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో నీటి జాడలు ఉన్నట్టు నాసాకు చెందిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ డాటాలో బయటపడింది. ఈ ల్యాండర్ ను 2018లో అంగారక గ్రహంపైకి పంపారు. నాలుగేళ్లుగా ఇది అక్కడి సిస్మిక్ డాటాను నమోదు చేస్తోంది. ఈ డాటాను పరిశీలించిన పరిశోధకులు.. అంగారక ఉపరితలం నుంచి 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలో మీటర్ల లోతు వరకు నీటి జాడలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఉపరితలం నుంచి లోపలికి నీరు వెళ్లి ఇంకిపోయి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
తుర్కియేలో బయటపడ్డ 13 వేల ఏళ్ల నాటి రాతి క్యాలెండర్
ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్ దక్షిణ తుర్కియేలో (టర్కీ) బయటపడింది. తుర్కియేలోని గోబెర్లి టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయటపడింది. దానిపై సూర్య చంద్రులకు సంబంధించిన గుర్తులు, మరికొన్ని ఇతర చిహ్నాలను గుర్తించారు. ఆ ఆలయం 13,000 ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్య చంద్రుల కాలాలకు సంబంధించినవని తెలిపారు. ఇలాంటి గుర్తులను దాదాపు 10,850 బి.సి.లో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో దీనిని ఓ క్యాలెండర్ గా ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.
దేశంలో 3 కొత్త రామ్సర్ సైట్లు
దేశంలో మూడు కొత్త రామ్సర్ సైట్లను గుర్తించినట్టు కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ తెలిపారు. దీంతో దేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 85 కు చేరింది, ఇది దేశంలో 13,58,068 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. కొత్తగా చేర్చిన మూడు సైట్లు తమిళనాడులోని నంజరాయన్ పక్షి ఆవాసం, కజువెలి పక్షి ఆవాసం, మధ్యప్రదేశ్ లోని తవా రిజర్వాయర్.
IIT -మద్రాసులో జల విజ్ఞాన కేంద్రం
ఐఐటీ మద్రాసులో సరికొత్త జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. శుభ్రమైన తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. పట్టణాల్లో నీటి సరఫరాకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి ఈ కేంద్రం పని చేస్తుంది. జల విజ్ఞానంలో కొత్త పరిశోధనలు, నవీకరణలు సాధిస్తుంది.
SSLV-డీ 3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. ఆగస్టు 16న ఉదయం తిరుపతి జిల్లా శ్రీహరికోట (షార్) కేంద్రం నుంచి SSLV-డీ 3 రాకెట్ ను నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది ఒక భూ పరిశీలక ఉపగ్రహం. ఒక మైక్రోశాటిలైట్ ను రూపొందించడం, దానిలో ఇమిడిపోయే పరిశోధన పరికరాలను అభివృద్ధి చేయడం EOS-8 మిషన్ ఉద్దేశమని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహంలో Electro Optical Infrared Pelod (EOIR), గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ – Reflectometry Pelod(GNSS-4), SIC యూవీ డోసీమీటర్ అనే మూడు పరికరాలు అమర్చారు. వీటితో విపత్తులు, పర్యావరణం, అగ్ని పర్వతాలపై పర్యవేక్షణ వంటివి చేపట్టవచ్చు.
2036 నాటికి భారత జనాభా 152 కోట్లు
భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరుగుతుంది. . కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన Women and Men in India 2023 Report ఈ విషయాన్ని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2కోట్లకు చేరనుంది. అలాగే 15 ఏళ్లలోపు వయసున్నవారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య కూడా భారీగా పెరగనుంది. దానివల్ల జనాభా పిరమిడ్ 2036 కల్లా అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పిరమిడ్ లో ప్రాథమిక భాగం తగ్గిపోయి, మధ్య స్థాయి భాగం విస్తృతం కానుంది.
గైడ్ బాంబ్ ‘గౌరవ్’ తొలి ప్రయోగం సక్సెస్
సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్(ఎల్ఆర్డీబీ) ‘గౌరవ్’ పరీక్ష విజయవంతమైంది. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన ఈ బాంబును DRDO మొదటిసారి ఓ యుద్ధ విమానం నుంచి 2024 ఆగస్టు 14వ తేదీ ప్రయోగించింది. ఒడిశా తీరంలోని లాంగ్ వీలర్ ద్వీపంపైన ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని గైడ్ బాంబ్ అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ చేసినట్టు రక్షణ శాఖ తెలిపింది. బాంబన్ ను విడిచిపెట్టాక అది Hybrid Navigation system ద్వారా లక్ష్యం వైపుగా సాగిందని వివరించింది. దాదాపు వెయ్యి కిలోల బరువుండే గౌరవ్ కు దూర ప్రాంతంలోని లక్ష్యా లను ఛేదించే సత్తా ఉందని పేర్కొంది. దీనిని హైదరాబాద్ లోని RCI (రీసెర్చ్ సెంటర్ ఇమారత్)లో రూపొందించి, అభివృద్ధి చేశారు.
ఎరక్రోటపై జాతీయ జెండా
ఆగస్టు 15నాడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎరక్రోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. వరుసగా 11వ సారి ఎరకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సారి వికసిత భారత్ థీమ్ తో పంద్రాగస్టు వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.
‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నారాయణ్ కన్నుమూత
ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) కన్నుమూశారు. ఆగస్టు 15న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. భూతల క్షిపణి.. భారత క్షిపణుల్లో అత్యంత పేరున్న ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే RN అగర్వాల్ ను Father of the Agni series of Missiles గా పిలుస్తారు. రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్ గా పనిచేశారు.
ED కొత్త చీఫ్ గా రాహుల్ నవీన్
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) తాత్కాలిక చీఫ్ గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ IRS అధికారి అయిన నవీన్, ఈడీ డైరెక్టర్ గా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు. 57 ఏళ్ల నవీన్ EDలో 2019 నవంబర్ లో ప్రత్యేక డైరెక్టర్ గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 15న నవీన్ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులయ్యారు.
JPC చీఫ్ గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద వక్ఫ్(సవరణ) బిల్లు-2024పై పార్లమెంట్ సంయుక్త కమిటీ(JPC) ఖరారైంది. ఈ కమిటీ చైర్ పర్సన్ గా బీజేపీ నేత జగదాంబికా పాల్ ను స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024 పై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేతల డిమాండ్ తో కేంద్రం Joint Parliament Committeeని ఏర్పాటు చేసింది. తర్వాత బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా జగదాంబికా పాల్ వ్యవహరిస్తారు. కమిటీలోని 31 మందిలో 21 మంది లోక్ సభ సభ్యులు. 10 మంది రాజ్యసభ MPలు ఉంటారని లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది.
థాయ్ లాడ్ ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర
థాయ్ లాడ్ కొత్త ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర (37)ను పార్లమెంటు ఆగస్టు 16న ఎన్నుకుంది. ఆమె మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె. షినవత్ర కుటుంబంలో ఈ పదవిని చేపట్టిన వారిలో పెటోంగ్జార్న్ మూడో వ్యక్తి. ప్రధాని పదవిని చేపట్టడానికి దిగువ సభలో కనీసం 247 మంది సభ్యుల మద్దతు అవసరం. ఫ్యూ థాయ్ పార్టీ ఆధ్వ్ర్యంలోని ని 11 పార్టీల కూటమికి 314 మంది సభ్యుల మద్దతు ఉంది. వీళ్ళు పెటోంగ్టార్న్ కి మద్దతు ఇచ్చారు. ప్రధాని పదవి నుంచి స్రేట్ట తవిసిన్ ను ఆగస్టు 14న కోర్టు తొలగించడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ఆయన నైతిక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు తీర్పు చెప్పింది.
పారా ఒలింపిక్స్ పతాకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 దాకా పారిస్ లో జరిగే పారాలింపిక్స్ లో ప్రారంభ వేడుకలకు భారత్ నుంచి పతాకధారులుగా సుమిత్ అంతిల్, భాగ్యశ్రీ జాదవ్ ఎంపికయ్యారు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ ఇద్దరూ ప్రారంభోత్సవ వేడుకల్లో పతాకధారులుగా వ్యవహరిస్తారని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) చీఫ్ దేవేంద్ర ఝఝరియా తెలిపారు. హర్యానాకు చెందిన సుమిత్ టోక్యో పారాలింపిక్స్ లో F64 జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణం గెలిచాడు. మహారాష్ట్రకు చెందిన షాట్ ఫుటర్ భాగ్యశ్రీ F34 కేటగిరీలో ఆసియా పారా గేమ్స్ రజతం నెగ్గింది. ఈ ఆటలకు భారత్ 84 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది.
App: Telangana Exams Plus/ Website: Examscentre247.com