ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయిన 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ముందడుగు పడింది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ రిక్రూట్ మెంట్ కి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దాంతో రేపో, ఎల్లుండో ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ ను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (PRT) ప్రకటించబోతోంది.
పోలీసు శాఖలో 25 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జనవరిలో 6,500 చొప్పున భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని 2019కి ముందు నిరుద్యోగులకు వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆ సంగతే మర్చిపోయారు. ప్రతి ఏటా పోలీసు అమర వీరుల సంస్మరణ (అక్టోబరు 21) నాడు పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాంమని ప్రకటించారు. మూడేళ్ళుగా ఇలా వాయిదా పడుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత రావడంతో… 2022 నవంబరు చివరి వారంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
4.58 లక్షల మంది అప్లయ్ చేసుకోగా… 2023 జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5న రిజల్ట్స్ ప్రకటించారు. మొత్తం 95,208 మంది అర్హత పొందినట్టు PRT ప్రకటించింది. అర్హులైన వారికి ఫిట్నెస్ పరీక్షలను 2024 మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహిస్తామని హాల్ టికెట్లు కూడా బోర్డు జారీ చేసింది. కానీ అదే టైమ్ లో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు రావడంతో కోడ్ కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. ఆ ఎన్నికల తరువాత నియామక ప్రక్రియను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పోలీసు ఉద్యోగాల్లో సివిల్ హోంగార్డులకు 15%, APSP హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులు ఉంటే, హోం గార్డులకే 1100 పోస్టులు ఎలాట్ అవుతాయి. వీళ్ళకి నిర్వహించిన ప్రిలిమ్స్ లో 3 వేల మంది హాజరయ్యారు. కానీ 400 మంది మాత్రమే అర్హత సాధించారు. తమకు కటాఫ్ తగ్గించాలనీ, అందర్నీ అర్హులుగా ప్రకటించాలని హోం గార్డులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. టీడీపీ ఆధ్వర్వంలోని NDA ప్రభుత్వం హయాంలో ఈ రిక్రూట్ మెంట్ ను తొందరగా పూర్తి చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. దీనిపై DGP, PRT చైర్మన్ కలసి చర్చించి… న్యాయపరమైన అడ్డంకులపై దృష్టిపెట్టారు. అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న PRT, కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిట్నెస్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.