తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలనీ, జీవో 29ని కొట్టివేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 బాధితుల పిటిషన్ పై చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. మరికొన్ని గంటల్లో పరీక్షలు ప్రారంభం అవుతున్న ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది,. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
మొన్నటిదాకా ఆందోళనలు, కోర్టుల్లో విచారణ పేరుతో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడతాయేమోనన్న ఆలోచనలో ఉన్నారు కొందరు అభ్యర్థులు. తెలంగాణలో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్ న్యాయమూర్తులు గ్రూప్ 1 మెయిన్స్ వాయిదాకు నిరాకరించారు. దాంతో అభ్యర్థులు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు…
అనేక అడ్డంకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు ఎట్టకేలకు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ ఎగ్జామ్ మొదలైంది. 2011 తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి Group.1 Mains exams ఇవి. గతంలో BRS హయాంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినా… పేపర్ లీక్స్ కారణంగా అనేక సార్లు రద్దయ్యాయి. ఈసారి అలాంటి పొరపాట్లు తలెత్తకుండా TGPSC పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 21 నుంచి 27 వరకూ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.