తెలంగాణలో టీచర్ల పోస్టుల భర్తీకి మరో DSC ప్రకటించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖాళీలపై ఇప్పటికే అధికారులు సేకరణ మొదలుపెట్టారు. ప్రస్తుతం 11,062 పోస్టుల భర్తీకి DSC నిర్వహించి Primary Key రిలీజ్ చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో DSC రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. ఆ తర్వాత అక్టోబరు నెలాఖరుకల్లా జిల్లాల వారీగా టీచర్ల నియామకాలు భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవగానే కొత్త DSCని ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిసెంబరు లేదంటే జనవరి నెలలో DSC Notification జారీ చేసి, జూన్, జూలైలోపు Recruitment పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపే TET కూడా నిర్వహించే ఛాన్సుందని అధికారులు చెబుతున్నారు. కొత్త DSC కింద తెలంగాణలో భర్తీ చేయాల్సిన టీచర్ల పోస్టుల సంఖ్య ఎంత అనే దానిపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం తీసుకుంటున్నారు. స్కూళ్ళ సంఖ్య, వాటిల్లో విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న DSC ద్వారా నియమితులయ్యే టీచర్లు పోస్టుల్లో చేరాక ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై లెక్కలు తేలుస్తున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్ల పోస్టులు ఖాళీలు కనిపిస్తున్నా… ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకంతకు తగ్గిపోతోంది. దాంతో కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల పోస్టులు ఉన్నా… విద్యార్థుల సంఖ్య స్వల్పంగా ఉంటోంది. అలాంటి పరిస్థితి తలెత్తితే… ఆ టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఇతర స్కూళ్ళకు పంపాలి. అలాంటి ప్రయత్నాలు చేశాకే కొత్త టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటే బెటర్ అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు.