దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (53)కు 2024కి సాహితీ నోబెల్ పురస్కారాన్ని 2024 అక్టోబర్ 10 నాడు ప్రకటించారు. ఆమె రచనల్లో చారిత్రక పరిణామాలు తెచ్చి పెట్టిన మనో వ్యాఘాతాలు, మానవ జీవితంలోని దుర్బలతను చాటి చెబుతాయని నోబెల్ కమిటీ తెలిపింది. బలహీనుల విషయంలో, ముఖ్యంగా మహిళల పట్ల సహానుభూతి కూడా వ్యక్తమవుతుందని కమిటీ అధ్యక్షుడు ఆండర్స్ ఓల్సన్ వివరించారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి, దక్షిణ కొరియా సాహితీవేత్త హాన్ కాంగే. 2000 సంవత్సరంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇప్పుడు ప్రపంచమంతటా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ సీరియల్స్ కి ఆదరణ లభిస్తున్న సమయంలో సాహితీ నోబెల్ కూడా ఆ దేశానికే దక్కింది.
2016లో హాన్ కాంగ్ రాసిన ది వెజిటేరియన్ నవలకు బుకర్ బహుమతి లభించింది. నోబెల్ సాహిత్య బహుమతిని ఉత్తర అమెరికా, ఐరోపా రచయితలకు… ముఖ్యంగా పురుషులకు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇంతవరకు సాహిత్యంలో 110 నోబెల్ పొందగా… వాళ్ళల్లో 17 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ విమర్శలకు ఈ ఏటి సాహితీ నోబెల్ ను కమిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. అన్ని విభాగాల్లో నోబెల్ బహుమతులను 2024 డిసెంబరు 10న ప్రదానం చేస్తారు. డైనమైట్ ను కనుగొన్న స్వీడిష్ శాస్త్రజ్ఞుడు ఆల్ఫైడ్ నోబెల్ పేరిట ప్రదానం చేసే ఈ బహుమతుల కింద 10 లక్షల డాలర్ల నగదు లభిస్తుంది. స్వీడన్ లోని స్టాక్ హామ్ కు చెందిన నోబెల్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందిస్తుంది.