మన టైమ్ ని మంచి ప్లానింగ్ తో వాడుకుంటే కెరీర్‌లో విజయం గ్యారంటీ. సమయాన్ని సద్వినియోగం చేసుకోడానికి కొన్ని టిప్ప్ మీకోసం..
మనందరికీ ఉండేది 24 గంటలే.. అయినా కొందరు ఆ టైమ్ ని సద్వినియోగం చేసుకొని విజయాలు సాధిస్తే… మరికొందరు వరుస ఓటములను ఎదుర్కొటున్నారు. మనం ఆ 24 గంటలను ఎలా వాడుకుంటామనేది ఏ పనికైనా కీలకం. చాలా మంది తమ స్టడీస్ లేదంటే ఉద్యోగాలకు ప్రిపరేషన్‌కు టైం సరిపోవడం లేదని అంటుంటారు.
కొందరికే టైం ఎందుకు సరిపోతుంది?
వాళ్లు ఎలా పరీక్షల్లో సక్సెస్ అవుతున్నారు ?
చాలా మందికి టైమ్ ఎందుకు సరిపోవట్లేదు ?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాలి.
ప్లానింగ్ ఉండాలి బ్రో…
ఈ డిజిటల్ యుగంలో ప్లాన్ లేకుండా ముందుకెళ్లడం చాలా కష్టం. ఏయే సబ్జెక్టులు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలనే దానిపై మీకు స్పష్టమైన క్లారిటీ ఉండాలి.
ఉదాహరణకు రోజూ మూడు సబ్జెక్టుల్లో మూడు చాప్టర్స్ చదవాలని మీరు ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారం ఆరోజుకి అవి చదివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మర్నాటికి వాయిదా వేయొద్దు. కారణం… మర్నాడు ఏమేం చదవాలో మీ దగ్గర ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ప్లాన్ ని తప్పిస్తే… రేపటి ప్లాన్ బర్డెన్ అవుతుంది. అందుకే ఏరోజు చదవాల్సిన… ఆ రోజే పూర్తిచేయడం ఎంతో అవసరం. ఇలా చేస్తే టైమ్ సరిపోకపోవడం, వృథా అవడం లాంటి సమస్యలు తలెత్తవు.
ఇది అకడమిక్ కి కూడా వర్తిస్తుంది. మార్చిలో ఎగ్జామ్స్ అంటే జనవరిలో మొదలు పెట్టడం కాకుండా… క్లాసులో జరిగిన పాఠాలు ఆరోజే పూర్తి చేసుకుంటే బెటర్. టెన్త్ వరకూ ఇలాంటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంటర్ నుంచే గాడి తప్పుతుంది.
ప్రతి నిమిషం, ప్రతి సెకన్ విలువైనది
టైమ్ ఎంతో విలువైంది. మళ్ళీ తిరిగి రదాు. అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తే నష్టపోయేది మనమే. తెలిసి చేసినా, తెలియక చేసినా.. వేస్ట్ అయిన టైమ్ ని తిరిగి పొందలేం. విద్యార్థి దశలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. మన టార్గెట్స్ రీచ్ కావాలంటే ప్రతి నిమిషమూ ఇంపార్టెంటే. ఈ విషయాన్ని గుర్తించడమే టైం మేనేజ్‌మెంట్‌కు మొదటి అడుగు. చిన్నచిన్న పనులకు టైమ్ వేస్ట్ అవుతుందని భావిస్తే.. కుటుంబ సభ్యుల సాయం తీసుకోవచ్చు.
ఉదా: అసైన్‌మెంట్లను ప్రూఫ్ రీడింగ్ చేయడాన్ని వారికి అప్పగించొచ్చు. ఆ సమయంలో మీరు మరో ఇంపార్టెంట్ లెసన్ చదువుకోవచ్చు.
ఏం చదవాలో ప్లానింగ్ ఉందా
మనం ఏమి చదవాలి అన్నది ప్లాన్ చేసుకోవాలి. నెల, వారం, రోజుల వారీగా ఆ వర్క్ ని విభజించుకోవాలి. దీంతో ఏరోజు పనులు ఆ రోజే పూర్తవుతాయి. ఒకరోజు చదవలేకపోతే… ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు.
మీకు ఉన్న పనుల్లో అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, ప్రస్తుతం చేయకపోయినా ఎలాంటి ఇబ్బందీలేనివి… ఇలా డివైడ్ చేసుకోవాలి. దాని వల్ల ప్రతి పనికీ కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు.
చదివే ప్రదేశాలు మార్చొద్దు..
టైమ్ మేనేజ్ మెంట్ లో మీరు చదివే ప్లేస్ కి ప్రాధాన్యం ఉంటుంది. గాలి, వెలుతురుతో నిశ్శబ్దంగా ఉండే చోటును ఎంపిక చేసుకోండి. అక్కడ కూర్చుని ఎన్ని గంటలు చదివినా ఇబ్బంది లేకుండా ఉండాలి. మంచం లేదా సోఫా మీద కూర్చుని చదివితే నిద్ర వచ్చే ఛాన్సుంది. చదవడానికి కుర్చీ, టేబుల్‌ను వాడితే బెటర్. ఎదురుగా క్లాక్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ సబ్జెక్టుకు ఎంత టైమ్ కేటాయిస్తున్నామో అర్థమవుతుంది. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయడానికి వీలుగా పెన్ను/మార్కర్ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమయ్యే వస్తువుల కోసం పదే పదే వేరే రూమ్ లోకి వెళ్ళే అవసరం లేకుండా చూసుకోండి. చదివే చోటును తరచూ మార్చొద్దు. రోజూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల.. అక్కడికి వెళ్లగానే చదవాలనే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇతర విషయాలేవీ మీకు గుర్తుకు రావు.
ఏకాగ్రత చాలా ముఖ్యం
కొందరు ఒక్క అధ్యాయాన్ని చదవడానికి కూడా గంటల కొద్దీ టైమ్ తీసుకుంటారు. ఒక వైపు చదువుతూనే.. మరోవైపు మొబైల్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుంటారు. కంప్యూటర్/మొబైల్/ట్యాబ్ లాంటి వాటిపై చదివేటప్పుడు వాటిల్లో వేరే వెబ్‌సైట్/మెసేజ్ లాంటివి ఓపెన్ కావడం వల్ల మన దృష్టి మరలుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. అందువల్ల మీరు స్పీడ్ గా చదవడం కుదరదు. అందుకే చదివేటప్పుడు సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయాలి. మరో వెబ్‌సైట్ చూడకుండా కట్టడి చేసుకోవాలి. అప్పుడే మీ దృష్టి ఒక్క పని మీద ఉంటుంది.
నిద్రపోడానికి టైమ్ ఉందా ?
టైమ్ మేనేజ్ మెంట్ పాటించడంలో నిద్రకి కూడా ప్రియారిటీ ఉంది. కొందరు అర్ధరాత్రి వరకూ చదివి ఉదయాన్నే నిద్ర లేస్తారు. లేదా మధ్యాహ్నం వరకూ నిద్రపోతుంటారు. ఇలా నిద్రించే సమయాలు మారితేు దాని ప్రభావం చదువు మీద పడుతుంది. నిద్ర టైమ్ ని కచ్చితంగా పాటిస్తేనే… చదవడానికి వేసుకున్న ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయగలుగుతారు. టైమ్ వేస్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. మన బాడీకి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. దాదాపు ఆరేడు గంటలపాటు నిద్రపోతే శారీరకంగా తగిన విశ్రాంతిని పొందుతారు. దాంతో మర్నాడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.
అకడమిక్ ఎగ్జామ్స్ కే కాదు… కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఈ టైమ్ మేనేజ్ మెంట్ సూత్రాలు పాటిస్తే… విజయం మీ సొంతమవుతుంది.
ఆల్ ద బెస్ట్