ఈమధ్యకాలంలో శ్వేత పత్రం అనే పదాన్ని తరచూ మనం వింటున్నాం. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి. ఫలానా అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసిందని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఈమధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ సర్కార్ లో చేపట్టిన నీటిపారుదల పథకాలు, విద్యుత్ ఒప్పందాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది.
ఏంటీ శ్వేత పత్రం ?
ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై రిలీజ్ చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అంటే ఒక అంశంపై ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం, వాస్తవ నివేదిక అని అర్థం. ఆ అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియజేస్తూనే, అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయొచ్చు. అలాగే, ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాని కంటే ముందు ఆ వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి జనానికి సమాచారం అందించవచ్చు.
శ్వేతపత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది
శ్వేతపత్రం అనే భావన పాలన నిర్వహణ నుంచి ఆవిర్భవించింది. బ్రిటన్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం (Churchill ) విడుదల చేసిన నివేదికను మొదటి శ్వేతపత్రంగా(First White paper in Britain) చెబుతుంటారు. యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని మొదటి బ్రిటీష్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శ్యాముల్ రూపొందించిన డ్రాఫ్ట్ ని మొదటి శ్వేతపత్రం (Churchill Memorandum)అని పిలుస్తారు. (Click here for Britain’s First White paper )
బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం చూస్తే…’ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ఒక్కోసారి ప్రజల అభిప్రాయలను సేకరించే ప్రభుత్వ నివేదకను శ్వేత పత్రంగా (White paper) అని అంటారు. బ్రిటన్ లో మొదలైన ఈ వైట్ పేపర్ భావన భారత్, కెనడా, అమెరికాలతో పాటు అనేక దేశాల్లోనూ అమలు చేస్తున్నారు.
వైట్ పేపరే కాదు… గ్రీన్ పేపర్ కూడా
కొన్ని దేశాల్లో వైట్ పేపర్‌తో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమలులో ఉంది. వివిధ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాని కంటే ముందు గ్రీన్ పేపర్ విడుదల చేస్తుంది. ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం రిలీజ్ చేసే సూత్రప్రాయి నివేదికను గ్రీన్ పేపర్ అంటారు. అంటే శ్వేతపత్రాలతో ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకుంటారు. అలాగే, ప్రభుత్వ పనితీరును అవగాహన చేసుకొని సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను ప్రజలు తెలుసుకోడానికి వైట్ పేపర్స్ ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.