---Advertisement---

Pay TM Future : పేటీఎం ఏ తప్పు చేసింది ?

డిజిటల్ లావాదేవీలు తెలిసిన వినియోగదారులు… దేశంలో పేటీఎం యాప్ వినియోగించని వారు ఎవరూ ఉండరేమో. కానీ ఇప్పుడు పేటీఎం మరుగుపడిపోతోంది,…. పేటీఎం కరో అని సౌండ్ బాక్స్ నుంచి వచ్చే శబ్దాలు ఆగిపోతాయా ? రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంను మనం వాడలేమా ? ఈ అనుమానాలకు సమాధానం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం.

(చుట్టూ జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు… అంటే పాలిటిక్స్ కాకుండా మిగతా అంశాలను మీ నాలెడ్జ్ కోసం వీటిని అందిస్తున్నాం.  రెగ్యులర్ గా www.examscentre247.com ను ఫాలో అవ్వండి )

దేశంలో డిజిటల్ వ్యాలెట్, డిజిటల్ నగదు సేవల్లో మార్పులు తెచ్చిన పేటీఎం (PayTM) గతం నుంచీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కుంది. ఇప్పుడు మాత్రం సొంతంగా కొని తెచ్చుకున్న సమస్య.  నిబంధనలు ఉల్లంఘించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ విభాగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. దాంతో సంస్థ భవిష్యత్తును అంధకారంలో పడిపోయింది.

మార్చి 1 నుంచి పేటీఎంలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, వ్యాలెట్ టాప్-అప్‌లు (Wallet top ups), బిల్లుల చెల్లింపుల లాంటి అన్ని సేవలను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) పేటీఎం బ్యాంకింగ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చింది. దాంతో పేటీఎం ఇన్వెస్టర్లు పెట్టుకున్న నమ్మకాలు వమ్ము అయ్యాయి. షేర్లు దారుణంగా పడిపోవడంతో వందల కోట్ల పెట్టుబడులు నష్టపోయారు. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ 2022 మార్చిలో బ్యాంకులు నిషేధం విధించిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఆర్బీఐ ఈ ఆదేశాలు ఇచ్చింది.

కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ లాంటి  తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పేటీఎం పాల్పడినట్టు ఆర్బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. పదే పదే రూల్స్ అతిక్రమిస్తుండటంతో పేటీఎం ఈసారి భారీగానే నష్టపోతోంది. భారీ ఫిన్ టెక్ సంస్థ కదా అని… తప్పులు దిద్దుకునేందుకు పేటీఎంకు తగినంత టైమ్ ఇచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ తెలిపారు.

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఒకప్పుడు దేశంలో అత్యంత చిన్నవయస్సులోనే బిలియనీర్‌. దేశంలోనే అతి పెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఒకటైన బైజూస్  పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ పేటీఎం సంక్షోభం బయటపడటంతో…బడా బడా స్టార్టప్స్‌ విషయంలో కార్పొరేట్ గవర్నెన్స్, నిబంధనల అమలు కావడం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. 2010లో ప్రారంభమైన పేటీఎం కొద్దిరోజుల్లో డిజిటల్ లావాదేవీలకు (Digital transactions) కేరాఫ్ గా మారింది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదుకు బదులు డిజిటల్ లావాదేవీలను జనం ఉపయోగించడం మొదలుపెట్టారు. దాంతో పేటీఎంకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 33 కోట్ల పేటీఎం వ్యాలెట్లు (Paytm Wallets) ఉన్నాయి. వాటి నుంచి పెద్ద పెద్ద వస్తువుల కొనుగోలు దగ్గర నుంచి వీథి వ్యాపారుల దగ్గర పండ్లు, పూలు కొనుక్కునేదాకా ఎలాంటి కొనుగోళ్ళకైనా చెల్లింపులు చేయొచ్చు. జపనీస్ టెక్నాలజీ ఇన్వెస్టర్ సాఫ్ట్ బ్యాంక్‌తో పాటు, కంపెనీ ప్రారంభ సమయంలో వారెన్ బఫెట్, అలీబాబా కూడా పేటీఎంలో పెట్టుబడులు పెట్టారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 2017లో లైసెన్స్ మంజూరైంది. ఇందులో 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు తీసుకోవచ్చు. కానీ రుణాలు ఇవ్వకూడదు. ఈ డిపాజిట్లలో ఉన్న క్యాష్ తో యాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు.  థర్డ్ పార్టీ ఇన్సూరెన్సులు, లోన్లను కూడా అమ్ముతోంది పేటీఎం. పేటీఎం యాప్ క్యూఆర్ కోడ్ తో చెల్లింపులు స్వీకరించే వ్యాపారులతో సహా, ఈ బ్యాంక్‌లో మొత్తం 5 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. పేమెంట్స్ యాప్ బిజినెస్‌పై RBI ఆదేశాల ప్రభావం ఉండదు. కానీ మొత్తం వ్యాపారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో పేటీఎం లిస్టింగ్ అయిన తర్వాత రెండేళ్లలో కంపెనీ దాదాపు 80 శాతం మార్కెట్ విలువను కోల్పోయింది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం లాంటి కారణాల వల్ల ఇందుక్కారణం. ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చిన తర్వాత పేటీఎం యాప్ డౌన్‌లోడ్స్ లో 20 శాతం తగ్గాయి. గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay) లాంటి యాప్‌ల డౌన్‌లోడ్‌లు 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ తీసుకున్న చర్యలు పేటీఎంతో పాటు ఆ కంపెనీకి మద్దతుగా ఉన్న చాలా స్టార్టప్ కంపెనీల్లో భయాన్ని కలిగించాయి. ఫైనాన్స్ బిజినెస్ కు ఇబ్బంది కలిగిస్తాయనీ… పేటీఎంపై ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐకి లెటర్లు రాశారు.

అసలు కారణం ఇదేనా ?

ప్రైవేట్ ఈక్విటీ ఇన్‌వెస్టర్‌లు (Private equity investors) పెట్టిన పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ రిటర్న్స్‌ ఆశించడ సహజం. కంపెనీ ఆర్థిక పరిస్థితులను కూడా చూడకుండా…. చిన్న మొత్తాలనే భారీ సంఖ్యలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పెట్టుబడులే ఓ కంపెనీ వాల్యుయేషన్‌ని నిర్ణయిస్తాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి గమనించకుండా ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టడమే సమస్యలకు కారణమవుతోంది.

పేటీఎమ్‌ విషయంలో RBI చెప్పింది ఏంటంటే… KYC కి సంబంధించి పేటీఎమ్‌ ఎలాంటి నిఘా పెట్టడం లేదు. ఒకటే ప్యాన్ నంబర్‌తో వేల అకౌంట్స్ క్రియేట్ అయ్యాయని అంటోంది. పేటీఎమ్ గ్రూప్‌లో అంతర్గతంగా కొన్ని భారీ లావాదేవీలు జరిగాయని కూడా చెబుతోంది రిజర్వ్ బ్యాంక్. వీటికి సంబంధించి ఎలాంటి వివరాలూ లేవు. అందుకే…పూర్తిగా వ్యవస్థపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. దాంతో  పాటు పేరెంట్ కంపెనీ One97Communications Ltdపైనా నిఘా పెట్టింది. Paytmలో జరుగుతున్న లావాదేవీలకు సరైన భద్రత లేదన్న వాదనలు వచ్చాయి. ఇది మనీ లాండరింగ్‌కి దారి తీయడంతో పాటు క్రెడిబిలిటీని దెబ్బ తీసింది. అందుకే…Paytm Payments Bank పై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. పేటీఎమ్ సంస్థలో గవర్నెన్స్ లేకుండా పోయింది. కేవలం వాల్యుయేషన్‌పైనే దృష్టి పెట్టడం వల్ల జరిగిన నష్టం ఇది అని చెప్పవచ్చు.

 

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!